తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం

  • బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి
  • బసవతారకం స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన సేవాసంస్థ
  • ఛైర్మన్ బాలకృష్ణ సారథ్యంలో ఏటా లక్షలాది మందికి అందుబాటులో వైద్యం
  • భవిష్యత్ ప్రణాళికగా అమరావతిలో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం
  • రజతోత్సవం సందర్భంగా 45,000 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఏ ఒక్క పేదవాడు ప్రాణాలు కోల్పోకూడదని, మరే కుటుంబంలోనూ ఇటువంటి విషాదం నిండకూడదని తన మాతృమూర్తికి ఇచ్చిన మాట మేరకు ఆ నిబద్ధత కొనసాగుతోంది. శోకం నుంచి శ్లోకం పుట్టి రామాయణం ఆవిర్భవించినట్లుగానే, తల్లిని కోల్పోయిన ఆవేదన నుంచి నందమూరి కుటుంబం సమాజం పట్ల ఒక గొప్ప బాధ్యతను భుజానికెత్తుకుంది. మహానాయకుడు ఎన్టీఆర్ తన భార్య స్మారకార్థం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. మాతృమూర్తికి ఇచ్చిన మాటకు కట్టుబడి, సమాజ శ్రేయస్సు కోరి గత 25 ఏళ్లుగా ప్రపంచస్థాయి క్యాన్సర్ వైద్యాన్ని ఈ సంస్థ ద్వారా అందిస్తున్నారు. ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తన సహచర సభ్యుల సహకారంతో ఈ ఆసుపత్రిని ఒక సేవా యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రజతోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సాధించిన మైలురాళ్లను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆసుపత్రి ఆరంభం నుంచి నేటి వరకు పెరిగిన వైద్య సౌకర్యాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు, రోగులు మరియు వారి బంధువులకు కల్పిస్తున్న వసతులు, అలాగే భవిష్యత్తు ప్రణాళికలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ఈ వేదికపై ప్రదర్శించారు.

**పేదలకు సేవచేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే**

"మానవత్వం నా ఆదర్శం - సమాజమే దేవాలయం - పేదలే దేవుళ్లు - వారికి చేసే సేవయే పరమాత్ముడికి చేసే సేవ" అన్న ఎన్టీఆర్ ఆశయాలను బసవతారకం ఆసుపత్రి తన సిద్ధాంతంగా మలుచుకుంది. లాభాపేక్ష లేకుండా, కేవలం మానవతా దృక్పథంతో ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో అడుగడుగునా అండగా నిలిచిన దాతలకు, నిస్వార్థంగా సేవలందించిన వైద్య నిపుణులకు, శాస్త్రవేత్తలకు, సిబ్బందికి మరియు రోగుల కుటుంబ సభ్యులకు ట్రస్ట్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ రజతోత్సవ శుభాకాంక్షలు అందించింది.

**మానవత్వంతో వైద్యం**

ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నందమూరి తారక రామారావు గారు 1988లో ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గారి చేతుల మీదుగా 100 పడకలతో ఈ సేవా ప్రస్థానం ప్రారంభమైంది. ఆసుపత్రి ఆశయ సాధనలో ప్రముఖ వైద్యులు, ఎన్ఆర్ఐలు మరియు శాస్త్రవేత్తల నిరంతర సహకారం ఎంతో కీలకమైంది. రజతోత్సవ వేళ వారందరి సేవలను సంస్థ స్మరించుకుంది.

**అందరి ఆస్పత్రి.. అందుబాటులో వైద్యం**

బసవతారకం ఆసుపత్రి కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, పొరుగు రాష్ట్రాల రోగులకు కూడా ఆశాదీపంగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రతి ఏటా సుమారు 3 లక్షల మందికి పైగా అవుట్ పేషెంట్లకు, 90 వేల మంది ఇన్ పేషెంట్లకు ఇక్కడ చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 8,000కు పైగా శస్త్రచికిత్సలు, 86 బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్లు విజయవంతంగా పూర్తి చేసి ఈ ఆసుపత్రి రికార్డు సృష్టించింది. ఇక్కడ చికిత్స పొందుతున్న వారిలో 65 శాతం కంటే ఎక్కువ మంది పేదలే ఉండటం విశేషం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ (PM-JAY) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా అర్హులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నారు.

**వీరే బలం.. బలగం**

ఆసుపత్రిలో సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజిస్టులు, పాథాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ నిపుణుల వంటి సుమారు 250 మంది నిపుణులైన వైద్య బృందం సేవలందిస్తోంది. తల, మెడ, రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, ప్రొస్టేట్ వంటి వివిధ రకాల క్యాన్సర్లకు ప్రత్యేక అవయవ ఆధారిత (Organ-based) చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, రోగుల మానసిక ధైర్యం మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక 'పాలియేటివ్ కేర్' యూనిట్ ఇక్కడ విశేష సేవలందిస్తోంది.

**ఉచిత స్క్రీనింగ్ సేవలు**

క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పిన మాటలను స్పూర్తిగా తీసుకుని, ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 2.7 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల ద్వారా మూడు ప్రపంచ రికార్డులను సైతం ఈ సంస్థ సొంతం చేసుకుంది. క్యాన్సర్ నివారణను ఒక సామాజిక ఉద్యమంగా మార్చడంలో ట్రస్ట్ విజయవంతమైంది.

**అమరావతిలో 1000 పడకల ఆస్పత్రి**

నందమూరి బాలకృష్ణ తన తల్లికి ఇచ్చిన మాటను, తండ్రి వేసిన మార్గాన్ని అనుసరిస్తూ ఈ ఆసుపత్రిని నిస్వార్థంగా నడిపిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల చిరునవ్వుల్లోనే ఆయన తృప్తిని వెతుక్కుంటున్నారు. రజతోత్సవం సందర్భంగా సేవలను మరింత విస్తరించాలని ట్రస్ట్ నిర్ణయించింది. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా అమరావతిలో 1,000 పడకలతో భారీ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.

"కష్టతరమైన మార్గాలు కొన్నిసార్లు అద్భుతమైన గమ్యస్థానాలకు దారి తీస్తాయి" అన్న క్యాన్సర్ సర్వైవర్ కియా వైన్ మాటలను ట్రస్ట్ సభ్యురాలు నారా బ్రాహ్మణి ఈ సందర్భంగా గుర్తు చేశారు. లక్షలాది మంది బాధితులకు కొత్త జీవితాన్ని ఇచ్చే దిశగా ఎన్.బి.టి.ఆర్.సి.ఎఫ్ (NBTRCF) ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ సేవా ప్రయాణంలో తమ కుటుంబం మూడు తరాలుగా భాగస్వామ్యం కావడం ఒక గొప్ప వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రజతోత్సవ వేడుకల సందర్భంగా 45,000 మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించామని, అందులో 25,000 మంది మహిళలే ఉన్నారని ఆమె వివరించారు.                                

Basavatarakam Indo American Cancer Hospital
Nandamuri Balakrishna
NTR Basavatarakam Cancer Foundation
Silver Jubilee Celebrations Hyderabad
Amaravati Cancer Hospital Expansion
Nara Brahmani

More Telugu News